ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి కన్నీటి నివాళి

బాలు అంత్యక్రియలకు మంత్రి అనిల్‌ కుమార్‌

Anil Kumar Yadav Attended SP Balu Funeral

చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ను కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు చెన్నై శివారులోని తామరైపాక్కం వ్యవసాయక్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు. బాలు అంత్యక్రియలకు ఏపి ప్రభుత్వం తరపున మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్పీ భౌతిక కాయానికి నివాళులర్పించి.. కుమారుడు ఎస్పీ చరణ్‌ను ఓదార్చారు. ‘నెల్లూరులో గానగంధర్వుడికి తగిన స్థాయిలో జ్ఞాపకం ఏర్పాటుకు సిఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్తాము. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. అన్నారు. ఆయన నెల్లూరు వాసి కావడం నెల్లూరు వ్యక్తిగా గర్వపడుతున్నాం. అన్ని భాషలలో అన్నివేల పాటలు పాడిన వ్యక్తి ఎవరూ లేరు, ఇక ఉండబోరు. బాలు కుటుంబానికి సిఎం ‌ జగన్‌ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సిఎం ‌ జగన్ తరపున ఘన నివాళి అర్పించాము’ అని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు.


కాగా మరి కాసేపట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. వీర శైవ జంగమ సంప్రదాయం ప్రకారం ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూర్చున్న పొజిషన్ లో బాలూ పార్ధివదేహాన్ని ఉంచి, అలాగే ఖననం చేయనున్నారు. తామరైపాక్కంలో తానెంతో ఇష్టంగా నిర్మించుకున్న ఫామ్ హౌస్ లో ఆయన ఖననం జరుగనుంది. అక్కడే ఓ స్మారకాన్ని కూడా ఏర్పాట్లు చేస్తామని కుటుంబీకులు వెల్లడించారు. దగ్గరి బంధుమిత్రులు, ప్రొటోకాల్ అధికారులు మినహా, అభిమానులకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేదు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/