పింఛన్‌ డబ్బులు రాక ఓ వృద్ధురాలు ఆందోళన

An old woman is worried about pension money

బెంగళూరు : రెండు నెలలుగా పింఛన్‌ డబ్బులు రాక ఆందోళన చెందిన ఓ వృద్ధురాలు.. 2 కిలోమీటర్లపాటు దేకుతూ పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆ వృద్ధురాలి కాళ్లకు గాయాలయ్యాయి. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో జరిగిన ఈ ఘటన.. అందర్నీ కలిచివేసింది. విషయం తెలుసుకున్న అధికారులు వృద్ధురాలిని హరిహర దవాఖానలో చేర్పించి వైద్యం అందించారు. జిల్లాలోని నందితవెరె గ్రామానికి చెందిన గిరిజమ్మకి గత రెండు నెలలుగా వృద్ధాప్య పింఛన్‌ అందట్లేదు. దీనిపై వృద్ధురాలు కునెబెలకెరె పోస్ట్‌మ్యాన్‌ను అడగగా, అతడు గిరిజమ్మకు దురుసుగా సమాధానమిచ్చాడు. తాను బతికేందుకు జీవనాధారమైన పెన్షన్‌ డబ్బుల కోసం తన గ్రామం నుంచి కునెబెలకెరె పోస్టాఫీస్‌కు మంగళవారం ఉదయం8 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు చేరుకుంది.

‘ఆటోలో వెళ్లేందుకు డబ్బులు లేక మెల్ల మెల్లగా దేకుతూ పోస్టాఫీస్‌కు చేరుకున్నా. నాకు పిల్లలు లేరు. నేను ఒంటరిగా జీవిస్తున్నా’ అని వృద్ధురాలు తెలిపింది. ఘటనకు సంబంధించిన వీడియో రెవెన్యూ అధికారికి చేరిందని, ఆమె పింఛన్‌ సమస్య పరిష్కరిస్తామని ఆశా వర్కర్‌ తెలిపారు.