‘హర్ ఘర్ తిరంగా’.. తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అమిత్ షా

కోట్లాదిమంది నిర్వాసితులుగా మారారన్న కేంద్ర హోంమంత్రి

Amit Shah hoists tricolour at his residence as part of ‘Har Ghar Tiranga’ movement

న్యూఢిల్లీః మత ప్రాతిపదికన దేశాన్ని విభజించడం చరిత్రలోనే చీకటి అధ్యాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఇందుకు మన దేశం ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. 1947 నాటి భయనక అనుభవాలు ఎంతోమందిని వెంటాడుతూనే ఉన్నాయన్నారు. విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి అమిత్ షా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… మతప్రాతిపదికన దేశ విభజన సమయంలో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారని, కోట్లాదిమంది నిర్వాసితులుగా మారారన్నారు. విభజన కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి అగస్ట్ 14న ‘విభజన గాయాల సంస్మరణ దినాన్ని’ పురస్కరించుకొని నివాళులర్పిస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా హర్ గర్ తిరంగా పేరుతో కార్యక్రమంలో భాగంగా అమిత్ షా తన ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేశారు. దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయినవారిని గుర్తు చేసుకునే సందర్భమని ప్రధాని మోడీ అన్నారు.

‘ఢిల్లీలోని ఓ గదిలో, ఓ డజను మంది వ్యక్తులు, కోట్లాది మంది అమాయక ప్రజల భవిష్యత్తును ఇష్టం వచ్చినట్టు లిఖించి, అఖండ భారత్‌ను ఎలా రెండు ముక్కలు చేశారో చూడండి.’ అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్వీట్ చేశారు.

‘దేశ విభజన గాయాల స్మారక దినం – అగస్ట్ 14’ అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. ‘అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి, అఖండ భారతాన్ని ఖండ ఖండాలుగా విడదీసిన కుట్రల విషపు వలయాల విభజన గాయాలు… భరతమాత కాయంనిండా మరకలుగా మిగిలి విషాదపు విలయాలై దేశ చరిత్రలో చీకటిరోజుగా నిల్చిన విషయాన్ని గుర్తించుకొని అఖండ భారత నిర్మాణమే మన లక్ష్యమై సాగాలని స్మరించుకుంటూ…విభజన సందర్భంగా అసువులుబాసిన స్వాతంత్ర్య ఉద్యమ వీరులందరికి నివాళులు అర్పిస్తున్నాను.’ అనిబండి సంజయ్ పేర్కొన్నారు.