అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ
PM Modi Says US Visit Occasion To Strengthen Strategic Partnership
న్యూఢిల్లీ : నేడు ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ విషయం పై ఆయన తన ట్విట్టర్‌లో అమెరికా టూర్ గురించి పోస్టు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు తాను ఆ దేశానికి వెళ్తున్నట్లు వెల్లడించారు. రెండు దేశాల మధ్య సమగ్రమైన వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి సమీక్షించనున్నట్లు మోడీ తెలిపారు. అమెరికా పర్యటన ద్వారా వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయనున్నట్లు తన ట్వీట్‌లో చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తోనూ ఆయన భేటీకానున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రెండు దేశాల మధ్య సహకారంపై ఆమెతో చర్చించనున్నారు.
క్వాడ్ నేతల సదస్సులోనూ పాల్గొననున్నట్లు మోడీ తెలిపారు. అధ్యక్షుడు బైడెన్, ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని మోషిహిడే సుగాలతో మోడీ భేటీ అవుతారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు స్కాట్ మారిసన్, సుగాలతో వ్యక్తిగతంగా సమావేశం కానున్నట్లు ఆయన చెప్పారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రసంగించనున్నట్లు తెలిపారు. కోవిడ్19, ఉగ్రవాదం, వాతావరణ మార్పులు లాంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/