చర్చకు రమ్మంటే టిడిపి ఎమ్మెల్యేలు పారిపోతున్నారుః అసెంబ్లీలో అంబటి ఎద్దేవా

తప్పు చేశాడు కాబట్టే చంద్రబాబు అరెస్ట్ అయ్యారన్న మంత్రి

ambati-rambabu-fires-on-chandrababu

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు తప్పుచేశారు కాబట్టే అరెస్టయ్యారని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి చర్చకు రావాలని అసెంబ్లీలో చెబితే టీడీపీ ఎమ్మెల్యేలు పారిపోయారన్నారు. తప్పుచేసిన వారు ఎవరైనా కోర్టు ముందు నిల్చోవాల్సిందే అన్నారు. ఆయన సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ… పక్కన ప్రతిపక్ష టిడిపి ఎమ్మెల్యేలు సభ నుంచి బాయ్‌కాట్ చేసి వెళ్లిపోవడంతో సభ ప్రశాంతంగా జరిగిందని, ప్రశ్నోత్తరాల సమయం జరిగి, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు.

అయితే ప్రధాన ప్రతిపక్షం లేకుండా సభ జరగడం మాత్రం తమను కాస్త బాధిస్తోందన్నారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష అని ఎవరైనా కొంతమంది అనుకుంటే కనుక కోర్టుల తీర్పులు, సభ నుంచి టిడిపి పారిపోవడంతో అది కూడా తేలిపోయిందన్నారు. చంద్రబాబు తన జీవితమంతా అన్యాయాలు, అక్రమాలు, మోసాలతో రాజ్యాధికారాన్ని చలాయించారన్నారు. రాజకీయాలను డబ్బుమయం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.

అధికారంలో ఉండగా చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారన్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా తప్పిదాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాఖజానా నుంచి డబ్బులు దోచుకున్నారన్నారు. దీనిని ప్రజలకు, కోర్టులకు వివరించడంతో అందరూ అర్థం చేసుకున్నారని చెప్పారు. చంద్రబాబు దొరికిన దొంగ అన్నారు. తప్పుచేసినవారు ఎవరైనా ఈ ప్రజాస్వామ్యంలో అరెస్ట్ కావాల్సిందే అన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయినా, కేంద్రంలో చక్రం తిప్పినా కోర్టును ఎదుర్కోవాల్సిందే అన్నారు.