అమర్​నాథ్ వరదల్లో 15 కి చేరిన మృతుల సంఖ్య..

అమర్​నాథ్ యాత్రికుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. శుక్రవారం అమర్​నాథ్ దేవాలయం వద్ద భారీ వరదలు బీబత్సం సృష్టించాయి. స్వల్ప వ్యవధిలో కురిసిన భారీ వర్షాల కారణంగా గుహ వద్ద భారీ వరద ముంచెత్తింది. సాయంత్రం అయిదున్నర గంటల ప్రాంతంలో ఊహించని రీతిలో కొండలపై నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద నీరు దూసుకువచ్చింది. వరదల్లో చిక్కుకొని ఇప్పటిదాకా 15 మంది యాత్రికులు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. దాదాపు 12 వేల మంది యాత్రికులు గుడారాల్లో తలదాచుకున్నారు. భారీగా వచ్చిన వరదకు గుడారాలు, యాత్రికులు కొట్టుకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

కరోనా తీవ్రత కారణంగా గత రెండేళ్లుగా నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న తిరిగి ప్రారంభమైంది. 43 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్రకు ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రెండు రోజుల కింద యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత వర్షం కొంత తెరిపి ఇవ్వడంతో యాత్రి తిరిగి ప్రారంభమైంది. అయితే, శుక్రవారం మధ్యాహ్నం ఊహించనివిధంగా వరదలు రావడం, పలు కుటుంబాల్లో విషాదం నింపింది.