పుష్పతో కొత్త పేరు సొంతం చేసుకున్న బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గతేడాది అల వైకుంఠపురములో చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా ఈ సినిమాను పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే పాత్రలో మనకు కనిపించనున్నాడు. ఈ పాత్రలో ఊరమాస్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు బన్నీ సిద్ధంగా ఉన్నట్లు తాజాగా రిలీజ్ అయిన పుష్పరాజ్ ఇంట్రో టీజర్‌లో మనం చూశాం. అయితే ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీకి పుష్ప చిత్ర యూనిట్ సరికొత్త బిరుదును ప్రకటించింది. ఇప్పటినుండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని దర్శకుడు సుకుమార్ తెలిపాడు. దీంతో బన్నీ కాస్త ఎమోషనల్‌గా మారి, సుకుమార్ తన కెరీర్‌లో స్టైలిష్ స్టార్ అనే బిరుదు రావడానికి ఆర్య చిత్రంతో కారణమయ్యాడని, ఇప్పుడు తన భవిష్యత్తు మొత్తం ఐకాన్ స్టార్‌గా మారేందుకు కూడా సుకుమార్ కారణమని బన్నీ అన్నాడు.

ఈ ఐకాన్ స్టార్ బిరుదును సార్థకం చేసుకునేందుకు తాను తీవ్రంగా కష్టపడుతూనే ఉంటానని బన్నీ చెప్పుకొచ్చాడు. ఇక పుష్ప చిత్రంతో ప్రేక్షకులను అలరింపజేసే ప్రయత్నంలో ఏమాత్రం ‘తగ్గేదే లే..’ అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. మొత్తానికి పుష్ప చిత్రంతో బన్నీకి కొత్త పేరు రావడం ఆయన అభిమానులను సంతోషానికి గురిచేసింది. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.