పవన్ కళ్యాణ్ ను కేఏ పాల్‌తో పోల్చిన వైస్సార్సీపీ మంత్రి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , కేఏ పాల్‌ ఇద్దరు ఒకటే అని ఎద్దేవా చేసారు వైస్సార్సీపీ మంత్రి జోగి రమేశ్. ప్రస్తుతం ఏపీ లో రోజు రోజుకు రాజకీయ వేడెక్కుతుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే నేతలు ప్రజల దగ్గరికి వెళ్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా చంద్రబాబు కుప్పం లో పర్యటించారు. ఈ పర్యటన లో చోటుచేసుకున్న ఉద్రిక్తతల ఫై అధికార , ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. కుప్పంలో టీడీపీ ఓటమి ఖాయమైందని.. అందుకే చంద్రబాబు వెన్నులో వణుకుపుడుతోందంటూ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీతో పాటు జనసేనపై కూడా మంత్రి జోగి రమేష్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి కనిపించడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో జరిగిన ఘటనలో అందుకు నిదర్శనమన్నారు.

పవన్ కల్యాణ్‌కు కథ, స్ర్కీన్ ప్లే చంద్రబాబు వహిస్తుంటే.. డైరెక్షన్ మాత్రం నాదెండ్ల మనోహర్ చేస్తున్నారంటూ మంత్రి జోగి రమేశ్ ఎద్దేవా చేశారు. ఏపీలో కేఏ పాల్‌కి, పవన్ కల్యాణ్‌కి తేడా లేదని.. ఇద్దరిలో ఏ ఒక్కరికీ ఏపీలో సీట్లు లేవని వ్యగ్యంగా విమర్శించారు. జాకీలు పెట్టి లేవలేని చంద్రబాబును నువ్వు మోయగలవా పవన్ కల్యాణ్ అంటూ సెటైర్లు విసిరారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జోగి రమేశ్ సవాల్ చేశారు. పొత్తులతో పొర్లాడటం తప్పించి ప్రజలకు మీరేం చేశారంటూ పవన్ కల్యాణ్‌ని నిలదీశారు.