అమెరికా ఒప్పందం…ధిక్కరించిన ఘనీ

తాలిబాన్లను జైలు నుంచి విడుదల చేయబోము

Ashraf Ghani
Ashraf Ghani

న్యూఢిల్లీ: కాబూల్‌ : తాలిబాన్లతో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని ఆఫ్ఘనిస్తాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ఘనీ ధిక్కరించారు. దేశంలో వివిధ జైళ్లలో వున్న దాదాపు 5 వేల మందికి పైగా తాలిబన్‌ ఖైదీలను విడుదల చేసేందుకు ఆ ఒప్పందం హామీ ఇవ్వగా, ఒక్క ఖైదీని కూడా విడుదలజేసేది లేదని ఘనీ ఆదివారం స్పష్టంగా తేల్చి చెప్పారు. తాలిబన్‌లతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందానికి ఇదొక ఎదురుదెబ్బ. తాలిబన్‌ ఖైదీలను విడుదల చేసేందుకు తాము ఎక్కడా అంగీకరించలేదని, ఇది ఆఫ్ఘన్‌ ప్రజల స్వయం నిర్ణాయక హక్కు అని, దానిని ఇంట్రాఆఫ్ఘన్‌ చర్చల అజెండాలో చేరుస్తామని, అందువల్ల ఇది శాంతి చర్చలకు ముందస్తు షరతు కాబోదని ఆయన వివరించారు. శాంతి ఒప్పందంలో తమ వద్ద వున్న ఖైదీలను విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించినప్పటికీ, ఇందులో తుది నిర్ణయం తమ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. అమెరికాతాలిబన్‌ శాంతి ఒప్పంద షరతుల ప్రకారం అమెరికన్‌ సైన్యం, ఆఫ్ఘన్‌ ప్రభుత్వం, తాలిబన్లు కలిసి వరుసగా 5,000 మంది తాలిబన్‌ ఖైదీలను, వెయ్యి మంది సాధారణ ఖైదీలను విడుదల చేయాల్సి వుంటుంది. అమెరికా, దాని మిత్రసేనలపై దాడులకు ఉగ్రవాద(తాలిబన్‌) గ్రూపులు ఆఫ్ఘన్‌ భూభాగాన్ని వినియోగించరాదని అంగీకరిం చారు. అదే విధంగా 14 నెలల్లోగా తమ సేనలను ఆఫ్ఘన్‌ భూభాగం నుండి పూర్తిగా ఉపసంహరించుకుంటామని, ఒప్పంద షరతుల ప్రకారం హామీలను నిలుపుకుంటే తాలిబన్‌ సభ్యులపై ఆంక్షలను ఎత్తివేస్తామని అమెరికా అంగీకరించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/