బీహార్ లో కల్తీ మద్యం తాగి మరో నలుగురు దుర్మరణం

కల్తీ మద్యం తాగి నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన బీహార్ రాష్ట్రం సివ‌న్ జిల్లాలోని భ‌గ‌వాన్‌పూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జరిగింది. చ‌ప్రా జిల్లాలో క‌ల్తీ మ‌ద్యం సేవించి 50 మందికి పైగా మ‌ర‌ణించిన ఘ‌ట‌న మ‌రవ‌క‌ముందే ఇప్పుడు మరో నలుగురి ప్రాణాలు కోల్పోయిన ఘటన సంచలనం రేపుతోంది.

గత కొంతకాలంగా బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ కల్తీ మద్యం ఏరులై పారుతున్నది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టిన..తనిఖీలు చేసిన గుట్టుచప్పుడు కాకుండా కల్తీ మద్యం తయారు చేస్తూ, సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో అమాయకపు మనుషుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

రాష్ట్రంలో క‌ల్తీ మ‌ద్యం సేవించి ప‌లువురు మ‌ర‌ణిస్తున్న ఘ‌ట‌న‌ల‌పై నితీశ్ స‌ర్కార్ ల‌క్ష్యంగా విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. మ‌రోవైపు చ‌ప్రా క‌ల్తీ మ‌ద్యం వ్య‌వ‌హారంలో ప్ర‌త్య‌క దర్యాప్తు బృందం (సిట్‌)తో విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిష‌న్ న‌మోదైంది.