అదానీ-హిండెన్‌బర్గ్‌ కేసు.. నేడు తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు

supreme-cour

న్యూఢిల్లీ: ఈరోజు అదానీ గ్రూపు అక్రమాలకు సంబంధించి హిండెన్‌బర్గ్‌ సంస్థ చేసిన ఆరోపణలపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్నది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం గత ఏడాది నవంబర్‌ 24న తీర్పు రిజర్వ్‌ చేసింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూపు చట్టం ఉల్లంఘనకు పాల్పడిందా? అనేదానిపై దర్యాప్తు జరపాలని గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు స్టాక్‌ మార్కెట్‌ రెగ్యులేటర్‌ ‘సెబీ’ని ఆదేశించింది. ఈ క్రమంలో దర్యాప్తును పూర్తి చేయడంలో సెబీ ఆలస్యం చేస్తున్నదని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దర్యాప్తు పూర్తి చేయడానికి సుప్రీంకోర్టు పెట్టిన డెడ్‌లైన్‌ను పాటించనందుకు సెబీపై ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని పిటిషన్‌దారు కోరారు.