రాజ్యసభకు స్వాతి మాలీవాల్‌ను నామినేట్‌ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ

AAP nominates DCW chief Swati Maliwal for Rajya Sabha

న్యూఢిల్లీః ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ ను రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆమెతోపాటు ఆ పార్టీ నేతలు సంజయ్‌ సింగ్‌, ఎన్డీ గుప్తాలను కూడా ఎగువ సభకు నామినేట్‌ చేస్తున్నట్లు ఆప్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ శుక్రవారం ప్రకటించింది. ‘డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ మొదటిసారిగా రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. సంజయ్‌ సింగ్‌, నరైన్‌ దాస్‌ గుప్తాలను రెండోసారి కూడా రాజ్యసభ సభ్యులుగా కొనసాగించాలని పీఏసీ నిర్ణయించింది’ అని ఆప్‌ తెలిపింది.

ఈ ఏడాది ఏకంగా 68 రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. రాజ్యసభ పదవీకాలం పూర్తికానున్న నేతల్లో పలువురు కేంద్రమంత్రులు, కీలక నేతలు ఉన్నారు. అందులో ఆప్‌ నేతలు సంజయ్‌ సింగ్‌, నరైన్‌ దాస్‌ గుప్తా, సుశీల్‌ కమార్‌ గుప్తాల పదవీ కాలం ఈ నెల 27తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ మూడు స్థానాలకు ఈ నెలాఖరున ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో ఆ మూడు స్థానాలకు ఆప్‌ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో సంజయ్‌ సింగ్‌, నరైన్‌ దాస్‌ గుప్తాలకు ఆప్‌ మరోసారి అవకాశం ఇచ్చింది. ఇక స్వాతి మొదటిసారి రాజ్యసభకు వెళ్లబోతోంది.