హోండురస్ మహిళా జైలులో ఘర్షణ.. 41 మంది మృతి

మరాస్ వీధి ముఠాల పనేనన్న అధ్యక్షుడు

41 women shot, stabbed, burned to death in Honduras prison riot

తెగుసిగల్ప: హోండురస్ మహిళా జైలులో చెలరేగిన అల్లర్లు 41 మంది ప్రాణాలు తీశాయి. మరి కొంత మంది గాయపడ్డారు. హోండురస్ రాజధాని తెగుసిగల్పాకు వాయువ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమారా మహిళా జైలు లో మంగళవారం ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో సుమారు 26 మంది మహిళా ఖైదీలు అగ్నికి ఆహుతయ్యారు. మరో 20 మంది బుల్లెట్ గాయాలు, కత్తిపోట్లతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఏడుగురు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు తెగుసిగల్పా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జైలులో ఉన్న రెండు గ్రూపుల మధ్య చోటు చేసుకున్న గొడవే ఈ మారణహోమానికి కారణమని తెలుస్తోంది.

జైళ్లలో అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి అధికారులు ఇటీవల చేసిన ప్రయత్నాల కారణంగానే అల్లర్లు జరిగాయని హోండురస్ జైళ్ల శాఖ అధికారి జూలిస్సా విల్లాన్యువా తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కాగా, ఈ హింసాకాండపై హోండురస్ అధ్యక్షుడు సియోమరా కాస్ట్రో విచారం వ్యక్తం చేశారు. నిందుతులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జైలులో ఆధిపత్యం కలిగిన మరాస్ వీధి ముఠాల పనేనని అన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. బారియో 18 ముఠా జైలులోని ఖైదీల సెల్ బ్లాకుల్లోకి చొరబడి కొందరిని కాల్చి చంపింది. మరికొందరిని తగలబెట్టింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.