రేపు మోడీకి ఆహ్వానం పలకబోతున్న మంత్రి తలసాని

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం సిద్ధమైంది. చాలఏళ్ల తర్వాత జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతుండడంతో బిజెపి నేతలంతా హడావిడిగా ఉన్నారు. ప్రధాని మోడీ, అమిత్​షా, జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, 360మంది జాతీయ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. రాజకీయ, ఆర్థిక తీర్మానాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. సమావేశాలతోపాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో జూలై3న నిర్వహించబోయే భారీ బహిరంగసభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే నేతలంతా హైదరాబాద్ కు చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం ప్రధాని మోడీ రాబోతున్నారు. ఈ క్రమంలో మోడీకి టిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు వెయిటింగ్‌ ఇన్ మినిస్టర్‌గా ప్రభుత్వం తలసానికి బాధ్యతలు అప్పగించింది. మధ్యాహ్నం 2.55 గంటలకు బేగంపేట విమానాశ్రయం వద్ద మోదీకి పుష్పగుచ్ఛం అందించి.. స్వాగతించనున్నారు. ఇదిలా ఉంటె పరేడ్ గ్రౌండ్​లో నిర్వహించే బహిరంగ సభను ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​ పరిశీలించారు.బిజెపి కార్యవర్గ సమావేశాలకు 18మంది ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు , జాతీయ నాయకులు హాజరవుతున్నారని కిషన్​రెడ్డి తెలిపారు. సభ కోసం 15ప్రత్యేక రైళ్లు, వందలాది బస్సులు ఏర్పాటు చేసుకొని కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని చెప్పారు. సమావేశాలు పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల అవరోధాలు కల్పిస్తోందని కిషన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.