కూప్పకూలిన రైస్‌ మిల్‌ భవనం..నలుగురు మృతి

4 killed, 20 injured after 3-storey rice mill collapses in Haryana’s Karnal

హర్యానా: హర్యానా రాష్ట్రంలో మూడంతస్తుల రైస్‌ మిల్‌ భవనం కుప్ప కూలి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాల్‌ నగరంలోని తరావడి ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

‘ప్రమాద సమయంలో రైస్‌ మిల్లులో 150 మంది కార్మికులు నిద్రిస్తున్నారు. భవనం ఒక్కసారిగా కుప్ప కూలడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 24 మంది ప్రభావితులవగా.. అందులో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించాం. భవనంలో కొన్ని లోపాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించాం. ఘటనపై విచారణకు కమిటీ వేసి.. రైస్ మిల్లు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని కర్నాల్‌ డీసీ అనీష్ యాదవ్ తెలిపారు.