దేశ సైనికుల కోసం 27 అడుగుల ప్రత్యేకమైన రాఖీ

21 మంది వీరజవాన్ల చిత్రాలతో రాఖీ

27 feet unique rakhi for country soldiers

బిలాస్‌పుర్‌: దేశవ్యాప్తంగా ఈనెల 31వ తేదీన రక్షాబంధన్‌ పండుగను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆడపడుచులంతా తమ సోదరులకు కట్టడానికి రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లా సాయిమౌళి ఆలయ కమిటీ.. దేశ సైనికుల కోసం ప్రత్యేకమైన రాఖీని రూపొందించింది.

పంజాబ్‌లోని ఉధంపుర్‌ సైనికులకు పంపేందుకు 27 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో రాఖీని తయారు చేశారు. ఈ రాఖీలో 21 మంది వీరజవాన్ల ఫొటోలను అమర్చారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చిత్రాలను కూడా ఇందులో అమర్చారు. ఈ రాఖీని బిలాస్‌పుర్‌ జిల్లా సైనిక్‌ సంక్షేమ బోర్డు అధికారుల ద్వారా రోడ్డు మార్గంలో ఉధంపుర్‌కు తరలించారు. ఈ ఆలయ కమిటీ గతేడాది 15 అడుగుల పొడవైన రాఖీని లద్దాఖ్‌ సైనికులకు పంపింది. దేశ సైనికులు తమ ఇళ్ల నుంచి రాఖీ అందినట్లు అనుభూతి పొందాలని ఇలా ప్రత్యేక రాఖీలు తాము పంపుతున్నట్లు ఆలయ కమిటీ సమన్వయకర్త దిలీప్‌ దేవర్కర్‌ పాత్రేకర్‌ తెలిపారు.