తల్లీ కొడుకుల ఆత్మహత్య కేసులో నిందితులకు 14 రోజుల కస్టడీ

రామాయంపేట తల్లికుమారుడి ఆత్మహత్య కేసులో నిందితులకు కోర్ట్ 14 రోజుల కస్టడీ విధించింది. దీంతో నిందితులు పల్లె జితేందర్ గౌడ్, సరాఫ్ యాదగిరి, ఐరేని పృథ్వీ గౌడ్, తోట కిరణ్, కన్నపురం కృష్ణ గౌడ్, సరాప్ స్వరాజ్లను నిజమాబాద్ జిల్లా జైలుకు తరలించారు. ఈ నెల 16 న మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన తల్లి గంగు పద్మ, కుమారుడు గంగు సంతోష్ లు కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్దగల ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 18 నెలలుగా రామయంపేట్ మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పృథివిరాజ్,తోట కిరణ్, కన్నాపురం కృష్ణగౌడ్, స్వరాజ్ లతోపాటు గతంలో రామయంపేట్ సిఐ గా పనిచేసిన నాగర్జున గౌడ్ లు వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకొని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

చనిపోయేముందు సంతోష్, తల్లి పద్మలు సెల్ఫీ వీడియో ద్వారా తమ మృతికి ఏడుగురు వ్యక్తులు కారణమంటూ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. మా చావుకు కారణమైన వారిని అందరూ చూస్తుండగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి శిక్షించాలి’ అని వేడుకున్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించారన్న అభియోగాలపై పోలీసులు అదే రోజు ఆ ఏడుగురిపై 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. నిన్న వీరంతా పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం తో ఈరోజు వారిని అడిషనల్ సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టారు. కామారెడ్డి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారికి 14 రోజుల కస్టడీ విధించారు.