చర్చలకు సిద్ధమన్న పుతిన్‌.. ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యా

దాదాపు 45 పట్టణాలపై దాడి చేసిన రష్యన్ బలగాలు

Russia bombards Ukraine with missiles on Christmas even as Putin says ‘ready for negotiations’

మాస్కోః ఉక్రెయిన్ తో యుద్ధం ముగిసే అవకాశం ఉందని, శాంతియుత చర్చల ద్వారా అది సాధ్యమేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పుతిన్ వ్యాఖ్యలతో యుద్ధం ఆగినట్టేనని పలువురు భావించారు. అయితే, పుతిన్ స్పందన తర్వాత కూడా ఉక్రెయిన్ పై రష్యా బలగాలు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నాయి. ఉక్రెయిన్ లోని పలు నగరాలపై రష్యా సైనికులు విరుచుకుపడుతున్నారు. ఖార్కీవ్ రీజన్ లోని పలు పట్టణాలపై రాకెట్లు, క్షిపణులతో రష్యా దాడి చేస్తోంది. ఖార్కీవ్ రీజియన్ లోని 25 పట్టణాలు, జపోరిజియాయ రీజియన్ లోని 20 టౌన్లపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. తాజా దాడులతో పుతిన్ వ్యాఖ్యలకు, చేతలకు పొంతన లేదనే విషయం తేలిపోయింది.

కాగా, ఉక్రెయిన్‌తో యుద్ధంలో సంబంధం ఉన్న వారందరితో చర్చలకు సిద్ధమని పుతిన్ ప్రకటించారు. కానీ ఉక్రెయిన్​, దాని పాశ్చాత్య మిత్రపక్షాలు మాత్రం చర్చల కోసం ముందుకు రావడం లేదని ఆరోపించారు. రష్యా మీడియా ఆదివారం విడుదల చేసిన ఓ ఇంటర్వ్యూలో పుతిన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.‘యుద్ధంతో సంబంధం ఉన్న వారందరితో చర్చలు జరపడానికి మేము సిద్ధం. ఆమోదయోగ్యమైన పరిష్కారాలు ఇస్తే చర్చలు జరుపుతాము. కానీ చర్చలనేది వారి చేతుల్లోనే ఉంది. చర్చలను మేము అడ్డుకోవడం లేదు. ఉక్రెయిన్​, దాని మిత్ర దేశాలే అడ్డుకుంటున్నాయి’ అని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/