హిందుస్థాన్ ముస్లింగా నేను ఎంతో గర్విస్తున్నా..ఆజాద్‌

నా జీవితంలో ఒక్కసారి కూడా పాకిస్థాన్ కు వెళ్లలేదు

న్యూఢిల్లీ: రాజ్యసభలో తన పదవీ విరమణ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ..తన సహచరులకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు పాకిస్థాన్ వెళ్ల‌ని అదృష్ట‌వ్య‌క్తిని తానే అని ఆయ‌న అన్నారు. పాకిస్థాన్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చ‌దువుతున్న‌ప్పుడు.. తాను ఇండియా ముస్లింనైనందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్న‌ట్లు ఆజాద్ అన్నారు. పార్ల‌మెంట్‌లో తాను స‌భా వ్య‌వ‌హారాల‌ను మాజీ ప్ర‌ధాని అట‌ల్ నుంచి నేర్చుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ దేశం నుంచి మిలిటెన్సీ, ఉగ్ర‌వాదం అంతం కావాలి ఆశాభావం వ్య‌క్తం చేశారు. జీవితంలో తాను ఏడ్చిన సంద‌ర్భాల గురించి కూడా చెబుతూ ఆజాద్ కొన్ని క్ష‌ణాల పాటు భావోద్వేగానికి లోన‌య్యారు. క‌శ్మీర్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో .. ఉగ్ర‌దాడిలో హ‌త‌మైన బాధిత కుటుబాల‌ను క‌లిసిన‌ప్పుడు తను ఏడ్చేసిన‌ట్లు చెప్పారు. ఇక ప్ర‌ధాని మోడితో త‌న‌కు ప్ర‌త్యేక అనుబంధం ఉన్న‌ట్లు తెలిపారు. వ్య‌క్తుల మ‌ధ్య ప‌ర్స‌న‌ల్ ట‌చ్ ఉంటే.. వారు భావోద్వేగానికి లోన‌వుతార‌ని ఆజాద్ అన్నారు.

స‌భ‌లో ఉన్న‌ప్పుడు మాట‌ల వాగ్వాదం ఉంటుంద‌ని, కానీ ప్ర‌ధాని మోదీ ఎన్న‌డూ త‌న వ్యాఖ్య‌ల‌ను వ్య‌క్తిగ‌తంగా తీసుకోలేద‌న్నారు. ప‌ర్స‌న‌ల్ అంశాల‌ను, రాజ‌కీయాల‌ను దూరం చేసి చూస్తార‌ని మోదీని పొగిడారు. ఈద్ కానీ, పుట్టిన రోజు కానీ.. ప్ర‌తిసారి మీరు ఫోన్ చేసేవార‌ని ప్ర‌ధాని గురించి ఆజాద్ తెలిపారు. ఓసారి రాజ్య‌స‌భ పోటీ స‌మ‌యంలోనూ మోదీ త‌న‌కు ఫోన్ చేసి సాయం చేసేందుకు ఆస‌క్తి చూపిన‌ట్లు గుర్తు చేశారు. స‌హ‌కారంతోనే దేశం ముందుకు వెళ్తుంద‌ని, ఘ‌ర్ష‌ణ‌ల‌తో కాదు అని ఆయ‌న అన్నారు.


కాగా, ఈ సందర్భంగా ప్రధాని మోడి మాట్లాడుతూ.. ఆజాద్ తనకు నిజమైన స్నేహితుడని చెబుతూ, భావోద్వేగానికి గురయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు.