మంత్రి జగదీష్ పీఏ ఇంట్లో ఐటీ రైడ్స్..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక సందడి నడుస్తున్న క్రమంలో అధికార పార్టీ టిఆర్ఎస్ మంత్రి జగదీశ్ పీఏ ఇంట్లో ఐటీ రైడ్స్ జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. నల్లగొండలో గల ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఐటీ అధికారుల బృందం చేరుకుంది.. అక్కడ సోదాలు చేస్తున్నారు. భారీగా నగదు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్ తెలుస్తోంది.

ఐటీ అధికారులు సోదాల కోసం ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. ఈ విషయం తెలిసి హుటాహుటిన ప్రభాకర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అయితే.. ప్రభాకర్ రెడ్డి ఇంట్లో నగదు ఉందన్న పక్కా సమాచారంతోనే ఐటీ అధికారులు ఈ దాడులు చేపట్టారని వార్తలు వస్తున్నాయి. మొత్తం 10 వాహనాల్లో వచ్చిన 30 మంది సభ్యుల ఐటీ బృందం ఈ సోదాల్లో పాల్గొంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం రేపటితో ముగియనుండటంతో.. ఈ రోజు ఐటీ దాడులు జరగటం.. అది కూడా ఓ మంత్రి పీఏ ఇంటిపై జరగటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను టీఆర్ఎస్ హై కమాండ్ జగదీశ్ రెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఎన్నికల నిబంధనలను జగదీశ్ రెడ్డి అతిక్రమించారని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఆ విషయం అలా ఉండగా ఆయన పీఏ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు.