రేపటి నుండి హైదరాబాద్ మెట్రో సమయాల్లో మార్పులు

నగరవాసులకు తీపి కబురు తెలిపింది హైదరాబాద్ మెట్రో. గత మూడు రోజులుగా భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. మాములుగానే హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు ఉంటాయి. ఇక వర్షం పడిందంటే రోడ్ల పైనే గంటల తరపడి ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో మెట్రో సేవలను ఈనెల 6 నుంచి మరో అరగంట పొడగించనున్నట్లు ప్రకటించింది.

గతంలో మాదిరిగానే ఉదయం 7 గంటల నుంచి మెట్రో సేవలు ప్రారంభమవుతాయి. రాత్రి 10.45 గంటలకు ముగుస్తాయి. ప్రతిరోజు మూడు మార్గాల్లో 1,000 ట్రిప్పులను మెట్రో తిప్పుతోంది. మెట్రోతో నగర ప్రజలు ట్రాఫిక్​ నుంచి కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఉదయం కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లేందుకు ఎక్కువగా నగర ప్రజలు మెట్రో సేవలనే వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సేవల పొడిగింపుతో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొన్నటి వరకు కరోనా ఉదృతి నేపథ్యంలో మెట్రో సేవలు నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం కరోనా ఉదృతి తగ్గడం తో మెట్రో సేవలను పూర్తి స్థాయిలో నడుపుతున్నారు.