ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదు..సీపీ

హైదరాబాద్‌: బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. ఘటనలో ఆటో డ్రైవర్లకు సంబంధం లేదని చెప్పారు. యువతి పోలీసులను తప్పుదోవ పట్టించిందని పేర్కొన్నారు. తనపై ఎలాంటి అత్యాచారం జరగలేదని యువతి చెప్పిందని, ఆమెకు ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఎప్పటి నుంచో ఉందని, 6 నెలల క్రితం తన ఫ్రెండ్‌కి ఇంకో కిడ్నాప్ కథ చెప్పిందని సీపీ వెల్లడించారు. 10వ తేదీ సాయంత్రం 5:30 గంట‌ల నుంచి రాత్రి 7:50 గంట‌ల వ‌ర‌కు 4 కిలోమీట‌ర్ల న‌డిచిన యువ‌తి.. కిడ్నాప్‌, అత్యాచారం చేశార‌ని నాట‌కామాడింది. ఈ కేసు వివ‌రాల‌ను రాచ‌కొండ సీపీ మీడియాకు వెల్ల‌డించారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5:30 గంట‌లకు బీ ఫార్మ‌సీ చ‌దువుతున్న యువ‌తి రాంప‌ల్లి బ‌స్టాండ్ వ‌ద్ద కాలేజీ బ‌స్సు దిగింది. అక్క‌డ్నుంచి ఆటోలో త‌న సీనియ‌ర్‌తో క‌లిసి ఎక్కింది. ఆమె దిగాల్సిన స్టాప్ కంటే ముందే సీనియ‌ర్ దిగి వెళ్లిపోయాడు. హెరిటేజ్ స్టాప్ వ‌ద్ద దిగాల్సిన విద్యార్థి, ఆ త‌ర్వాతి స్టాప్‌లో ఆటో దిగింది. అప్పుడు సాయంత్రం 6:30 గంట‌ల స‌మ‌యం అవుతోంది. యువ‌తి త‌న త‌ల్లికి ఫోన్ చేసి త‌న‌ను ఎవ‌రో కిడ్నాప్ చేశార‌ని చెప్పింది. దీంతో కంగారుప‌డ్డ త‌ల్లి 100కి డ‌య‌ల్ చేయ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.


కీస‌ర‌, ఘ‌ట్‌కేస‌ర్‌, మ‌ల్కాజ్‌గిరి పోలీసులు అప్ర‌మ‌త్త‌మై యువ‌తి ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. యువ‌తికి ప‌లుమార్లు ఫోన్ చేయ‌గా చివ‌ర‌కు 7:45 గంట‌ల‌కు ఫోన్ లిఫ్ట్ చేసింది. తాను ఉన్న లోకేష‌న్‌ను పోలీసుల‌కు షేర్ చేయ‌డంతో పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. యువ‌తి కాలికి గాయ‌మైన‌ట్లు పోలీసులు గుర్తించారు. బ‌ట్ట‌లు కూడా స‌రిగా లేక‌పోవ‌డంతో పోలీసులు ఆమెపై అత్యాచారం జ‌రిగింద‌ని భావించి మేడిప‌ల్లిలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికీ ఆ అమ్మాయి పోలీసుల‌కు స్పందించ‌డం లేదు. ఏం జ‌రిగిందో చెప్పే స్థితిలో లేదు.


పోలీసులు ఆ రోజు రాత్రి అమ్మాయిని విచారిస్తున్న సంద‌ర్భంగా కొన్ని విష‌యాలు చెప్పింది. త‌న‌ను బ‌ల‌వంతంగా ఆటోలో ఎక్కించుకుని ఇంజెక్ష‌న్ ఇచ్చార‌ని, త‌ల‌పై బాదార‌ని తెలిపింది. తెల్ల క‌ల‌ర్ ఆటోలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు, అది సెవెన్ సీట‌ర్ ఆటోల అని చెప్పింది. యువ‌తి చెప్పిన స‌మాచారంతో అన్నోజిగూడ ఏరియాలోని ఆటో డ్రైవ‌ర్ల‌ను సుమారు 100 మందిని విచారించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ ముగ్గురిలో ఒక‌రు త‌న‌ను బ‌ల‌వంతం చేశార‌ని పోలీసుల‌కు తెలిపింది. దీంతో అత‌న్ని పోలీసులు విచార‌ణ చేయ‌గా, తాను ఆ స‌మ‌యంలో బార్‌కు వెళ్లాన‌ని ఆటో డ్రైవ‌ర్ చెప్పాడు. డ్రైవ‌ర్ స‌మాధానంతో సీసీటీవీ ఫుటేజీలు ప‌రిశీలించ‌గా నిజ‌మేన‌ని తేలింది. యువ‌తి త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న‌ట్లు పోలీసులు గ్ర‌హించారు.

ఇక ఆ యువ‌తి మ‌రుస‌టి మ‌రో నాట‌కానికి తెర‌లేపింది. త‌న‌పై అత్యాచారం చేశార‌ని తెలిపింది. దీంతో యువ‌తిని మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్‌కు పంప‌గా అలాంటిదేమీ జ‌ర‌గ‌లేద‌ని తేలింది. ఇక చివ‌ర‌కు ఆ యువ‌తి జ‌రిగిన విష‌యాన్ని పోలీసుల‌కు వివ‌రించింది. ఇంటి నుంచి వెళ్లిపోయేందుకే కిడ్నాప్ నాట‌కం, అత్యాచారం చేశార‌ని త‌ల్లికి ఫోన్ చేసి చెప్పాన‌ని యువ‌తి పోలీసుల‌కు చెప్పింది. ఆర్నేళ్ల క్రితం కూడా ఆమె ఇలాగే కిడ్నాప్ నాట‌కామాడిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. కుటుంబ స‌భ్యుల‌తో గొడ‌వ‌ల కార‌ణంగానే యువ‌తి ఈ ప్ర‌ణాళిక చేసిన‌ట్లు పోలీసులు విక‌రించారు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలపైన, సైంటిఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌ పైన దృష్టి సారించారు.