ఇకపై రోడ్డుపైకి వచ్చి నిరసనలు లేవు.. కోర్టులోనే తేల్చుకుంటాం : రెజ్లర్లు

Wrestlers Protest: No More Street Protests, Wrestlers Say “Fight To Continue In Court”

న్యూఢిల్లీః డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ , బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌ సింగ్‌ కు వ్యతిరేకంగా భారత అగ్రశ్రేణి క్రీడాకారులు గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తాజాగా వారు కీలక నిర్ణయం తీసుకున్నారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ రోడ్డెక్కిన రెజ్లర్లు .. ఇకపై రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలపబోమని స్పష్టం చేశారు. అయితే తమకు న్యాయం జరిగే వరకూ ఆయనపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అది కోర్టులో తేల్చుకుంటామని.. ఇకపై రోడ్డెక్కబోమని ప్రకటించారు. ఈ విషయాన్ని రెజ్లర్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘అధికార బీజేపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చార్జీషీట్ దాఖలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చుకుంది’ అని టాప్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్ , సాక్షి మాలిక్ , భజరంగ్ పునియా తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ప్రక్రియ ముగిశాక తమకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రభుత్వం తెలిపినట్లు చెప్పారు. ఆ మేరకు వేచి చూస్తామన్నారు. కానీ, బ్రిజ్ భూషణ్ పై మాత్రం తమ పోరాటాన్ని విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్ తెలిపారు.