అమిత్ షా ప్రసంగం ఫై టిఆర్ఎస్ నేతల ఆగ్రహం

నిన్న ఆదివారం మునుగోడు లో బిజెపి సమరభేరి సభ భారీ ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభకు ముఖ్య అతిధి గా కేంద్ర మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అమిత్ షా సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక సభలో అమిత్ షా కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు.

రాబోయే రోజుల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేలా ఈ మునుగోడు సభను చూస్తుంటే అర్థమవుతోందని అన్నారు. రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలోకి చేర్చుకునేందుకు నేను ఇక్కడికి వచ్చానని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని కేసీఆర్‌ గతంలో చెప్పారని, ఇచ్చిన మాటలు అమలు చేయని పాలన కేసీఆర్‌ది అంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రిని చూస్తారని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు. మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్‌ నిర్వహించడం లేదని, తాము అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు.

ఇక అమిత్ షా వ్యాఖ్యల ఫై టిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమిత్‌ షా సభపై బీజేపీ శ్రేణులు పెట్టుకున్న ఆశలు నీరుగారాయని, మునుగోడు సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వ్యా ఖ్యానించారు. మునుగోడులో ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్‌ అఖండ విజ యం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, నినాదాలకు సభికుల నుంచి కనీస స్పందన రాలేదని, దీంతో ఆయన 15 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించి వెనుదిరిగారని పేర్కొన్నా రు. అమిత్‌ షా తన ప్రసంగంలో అన్నీ అబద్ధాలనే వల్లించాడని, ఆధార రహిత ఆరోపణలు మినహా మరోటి లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎందుకు తేల్చలేక పోయావు మోదీ అని నిన్నటి అదే మునుగోడు సభలో సీఎం కేసీఆర్‌ సూటిగా ప్రశ్నిస్తే ఎందుకు సమాధానం చెప్పలేదని జగదీశ్‌రెడ్డి నిలదీశారు. బండి సంజయ్‌ నోట్లో నోరు పెట్టి మాట్లాడినట్టు ఉన్నదని, అందులో కొత్తదనం ఏ మాత్రం కనిపించలేదని స్పష్టం చేశారు. ఆయన మాటల్లో పూర్తిగా దిగజారుడు తనం కనిపించిందని తెలిపారు.