లిక్కర్ విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం

లిక్కర్ తాగే విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేందుకు అనుమతిచ్చింది. స్పోర్ట్స్ స్టేడియాలతో సహా పలు బహిరంగ ప్రదేశాల్లో లిక్కర్ తాగొచ్చని స్టాలిన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.

తమిళనాడులో మద్యం అమ్మకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సాగుతున్నాయి. దీనికోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్)పేరుతో ఓ సంస్థనే నెలకొల్పింది. ప్రైవేటు కంపెనీలు, బ్లాక్ మార్కెట్‌కు అవకాశం లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ సహా అన్ని రకాల మద్యం టస్మాక్ అవుట్‌లెట్స్‌లల్లో లభిస్తాయి.

తమిళనాడు రాష్ట్రంలోని సమావేశ మందిరాలు, కన్వెన్షన్ సెంటర్లు, కళ్యాణ మండపాలు, బాంకెట్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాలు, గృహ కార్యక్రమాలలో మద్యం అందించడానికి ప్రత్యేక లైసెన్స్‌ విధానాన్ని తీసుకువచ్చింది. అయితే తమిళనాడులో మద్యం అక్రమ అమ్మకాలను అరికట్టేందుకు గత ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలకు భిన్నంగా స్టాలిన్ ప్రభుత్వం తాజా చర్య తీసుకుంది.