మహిళలు కళ్లు మాత్రమే కనిపించేలా బురఖా ధరించాలి : తాలిబన్ హుకుం

మహిళలకు ముఖ్యమైన పని ఉంటేనే బయటికి రావాలని ఆదేశం


కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ లో మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పివేసే బురఖా ధరించి రావాలని ఆఫ్ఘనిస్థాన్ సుప్రీంనేత, తాలిబన్ చీఫ్ హిబాతుల్లా అఖుంద్ జాదా హుకుం జారీ చేశారు. తల పైభాగం నుంచి పాదాల వరకు ఉండే ఛదోరి (బురఖా) సంప్రదాయబద్ధమైనదని, ఇది ధరించడం వల్ల గౌరవప్రదంగా ఉంటుందని స్పష్టం చేశారు.

మరీ వృద్ధులు కాని వారు, మరీ చిన్నవయసు కాని స్త్రీలు తమ ముఖాన్ని తప్పక దాచుకోవాలని, వారి కళ్లు మాత్రమే కనిపించేలా దుస్తులు ఉండాలని, షరియా చట్టం ఇదే చెబుతోందని అఖుంద్ జాదా పేర్కొన్నారు. స్త్రీలు పర పురుషులను కలిసినప్పుడు వారిలో రెచ్చగొట్టే భావనలను ఈ బురఖా (చదోరి) నివారిస్తుందని వివరించారు. అంతేకాదు, ఎంతో ముఖ్యమైన పని ఉంటేనే మహిళలు బయటికి రావాలని, లేని పక్షంలో వారు ఇంట్లో ఉండడమే మంచిది అని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు అఖుంద్ జాదా జారీ చేసిన హుకుంను కాబూల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తాలిబన్ వర్గాలు విడుదల చేశాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/