ప్రయాణికులకు ఊరటనిచ్చిన డీజీసీఏ

లగేజ్‌ లేకపోతే..విమాన టికెట్‌పై డిస్కౌంట్‌

న్యూఢిల్లీ: చెక్‌ ఇన్‌ లగేజ్‌ లేకుండా కేవలం క్యాబిన్‌ బ్యాగులతో మాత్రమే ప్రయాణించేవారికి టికెట్లపై రాయితీలు ఇచ్చేలా దేశీయ విమాన సంస్థలకు డీజీసీఏ అనుమతనిచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ సర్క్యులర్‌లో వెల్లడించింది. అవసరం లేకపోయినా చిరుతిళ్లు, డ్రింక్స్, మీల్స్, లాంజ్ సర్వీసెస్ వంటి వాటి ద్వారా కూడా అదనంగా భారం పడుతోంది. దీనిపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పందించింది. ప్రయాణికులకు ‘నో బ్యాగేజ్’ లేదా ‘ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్’ సౌకర్యం కల్పించింది.

పాత నిబంధనల ప్రకారం క్యాబిన్ బ్యాగేజీ 7 కిలోలు, చెకిన్ బ్యాగేజీ 15 కిలోల వరకు ఉండొచ్చు. అది దాటితే చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేవలం క్యాబిన్ లగేజీ లేదా అసలు లగేజీ లేకుండా ప్రయాణించే వారికి టికెట్లను తక్కువ ధరకు ఇచ్చే ఉద్దేశంతో డీజీసీఏ ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. టికెట్ బుక్ చేసుకునే టైంలోనే లగేజీ బరువును వెల్లడిస్తే టికెట్ ధరలో డిస్కౌంట్ ఇస్తారు.

అయితే, కేవలం డొమెస్టిక్ విమానాల్లోనే ఈ వెసులుబాటును కల్పించనున్నారు. టికెట్ బుకింగ్ టైంలో జీరో/క్యాబిన్ బ్యాగేజీని ఎంచుకుని, ప్రయాణ సమయంలో ఎక్కువ లగేజీని తెస్తే మాత్రం విమానయాన సంస్థల ధరలకు తగ్గట్టు చార్జీలు వసూలు చేస్తారని ప్రకటించింది. దాంతో పాటు సీటును ఎంపిక చేసుకునే వెసులుబాటునూ కల్పించింది. మీల్జస్నాక్స్జడ్రింక్స్ చార్జీలు, ఎయిర్ లైన్ లాంజ్ సర్వీస్, క్రీడా పరికరాలు, సంగీత పరికరాల చార్జీలనూ టికెట్ ధరల నుంచి మినహాయించుకోవచ్చు. వీటితో చాలా మందికి అవసరం లేదని, చార్జీల ధరల నుంచి వాటిని మినహాయించాలని పలువురు ప్రయాణికులు కోరడంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ అవీ కావాలనుకునే వారు ప్రత్యేకంగా వాటిని ఎంచుకోవచ్చని డీజీసీఏ పేర్కొంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/