ఏపీలో బ‌ల్క్ డ్ర‌గ్ పార్క్‌ను ప్ర‌క‌టించిన కేంద్రం… ప్రధానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన సోము వీర్రాజు

ఏపీకి బ‌ల్క్ డ్ర‌గ్ పార్క్‌ ను కేంద్రం ప్రకటించడం పట్ల మోడీకి బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలో ఇది ఏర్పాటు కానుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఎస్‌ఎస్‌సీ (స్కీమ్‌ స్టీరింగ్‌ కమిటీ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్‌) 90 రోజుల్లోగా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ అయిన ఐఎఫ్‌సీఐ(ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)కు పంపాలని కేంద్రం కోరింది.

ఇక ఏపీకి బల్క్ డ్ర‌గ్ పార్క్‌ను కేటాయించడం పట్ల సోము వీర్రాజు త‌న ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఏపీకి బ‌ల్క్ డ్ర‌గ్ పార్క్‌ను కేటాయించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాల‌కు రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని ఆయ‌న తెలిపారు. దీనిద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. రానున్న ఎనిమిదేళ్లలో పార్క్‌ ద్వారా రూ.46,400 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని, 10 వేల నుంచి 12 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.