విద్యుత్ నిర్వహణపై ప్రభుత్వానికి పలు సూచనలు

చండీగర్ : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పై నవ్ జోత్ సింగ్ సిద్ధూ మరోసారి ఫైర్ అయ్యారు. ఇటీవలే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో ఆయన సమావేశమైనా.. వర్గపోరు సమసినట్టు కనిపించడం లేదు. తాజాగా రాష్ట్రంలో విద్యుత్ కోతలపై ఆయన నిరసన గళం వినిపించారు. కరెంట్ ధరలు, కోతలు, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, 24 గంటల ఉచిత కరెంట్ వంటి వాటిపై ‘వాస్తవాలు’ అంటూ కొన్ని విషయాలను వెల్లడించారు.

ఆఫీసు పనివేళలను నియంత్రించేందుకు లేదా ప్రజలు ఏసీ వాడకుండా చేయడం కోసం పంజాబ్ ముఖ్యమంత్రికి కరెంట్ కోతలే పరిష్కారం కాదని అన్నారు. సరైన దిశలో వెళ్తే పరిష్కారం దొరుకుతుందని హితవు చెప్పారు. పంజాబ్ సగటున ఒక్కో యూనిట్ కు రూ.4.54 ఖర్చు చేస్తోందని, అయితే జాతీయ సగటు ధర మాత్రం కేవలం రూ.3.85 అని గుర్తు చేశారు. చండీగఢ్ కేవలం రూ.3.44 చెల్లిస్తోందన్నారు. 3 ప్రైవేట్ థర్మల్ ప్లాంట్ల మీద ఆధారపడడం వల్ల ఒక్కో యూనిట్ కు రూ.5 నుంచి రూ.8 వరకు ఖర్చవుతోందని అన్నారు. బాదల్ హయాంలోనే ఆ మూడు సంస్థలతో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు జరిగాయని సిద్ధూ గుర్తు చేశారు. ఆ ఒప్పందాల్లోని లొసుగుల వల్ల 2020 దాకా పంజాబ్ ప్రభుత్వం.. వాటికి రూ.5,400 కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. మున్ముందు మరో రూ.65 వేల కోట్లు చెల్లించాల్సి రావొచ్చని అసహనం వ్యక్తం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/