మంత్రి మల్లారెడ్డి అనుచరుడి ఇంట్లో తనిఖీలు

సోదాలు నిర్వహించిన ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్

malla reddy

హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు, వారి అనుచరుల ఇళ్ళల్లో సోదాలు జరుగుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డి అనుచరుడు, బిఆర్ఎస్ బోడుప్పల్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయి. ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంజీవరెడ్డి నివాసానికి మల్లారెడ్డికి చెందిన డబ్బు భారీ మొత్తంలో చేరిందన్న ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సోదాలు జరిగాయి. సంజీవరెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుని సోదాలు చేశారు. అయితే, సోదాల్లో ఎలాంటి డబ్బు దొరకకపోవడం గమనార్హం. సోదాల సందర్భంగా సంజీవరెడ్డి ఇంటి ముందు బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు.