పీఎస్‌ఎల్‌వీ -సీ53 రాకెట్‌ ప్రయోగం సక్సెస్

పీఎస్‌ఎల్‌వీ-సీ53 సక్సెస్ అయ్యింది. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్‌) ఇందుకు వేదికగా నిలిచింది. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్‌ ఇండియ లిమిటెడ్‌ ద్వారా పూర్తి వాణిజ్య పరంగా నిర్వహించనున్న ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 3 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్‌–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్‌–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం. కౌంట్‌డౌన్‌ సమయంలోనే నాలుగు దశల రాకెట్లో 4, 2 దశల మోటార్లలో ద్రవ ఇంధనాన్ని నింపారు.

అనంతరం 1, 3 దశల మోటార్లకు ఘన ఇంధనాన్ని నింపే ప్రక్రియను శాస్త్రవేత్తలు చేపట్టారు. ఇంధనాన్ని నాలుగు దశలలో నింపిన అనంతరం రాకెట్‌లోని ఎలక్ట్రానిక్‌ వ్యవస్థల పనితీరును పరిశీలించారు. ప్రయోగానికి సుమారు 30 నిమిషాల ముందు రాకెట్‌ను శాస్త్రవేత్తలు సూపర్‌ కంప్యూటర్‌ ఆధీనంలోకి తీసుకొచ్చారు. సూపర్‌ కంప్యూటర్‌ ఆదేశాలతో కౌంట్‌డౌన్‌ 0కు చేరుకోగానే నారింజ రంగు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.

ఇస్రో వాణిజ్య పరంగా పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2016లో పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు వుండడంతో చాలా దేశాలు భారత్‌ నుంచే ప్రయోగాలకు మొగ్గుచూపుతున్నాయి.