జీవీకే పవర్ నష్టం రూ. 96 కోట్లు

హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నష్టం స్వల్పంగా తగ్గింది. ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ డిసెంబరుతో ముగిసిన మూడు నెలలకు రూ.96 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.100.48 కోట్ల నష్టాన్ని చవి చూసింది. మొత్తం ఆదాయం రూ.1,109 కోట్ల నుంచి రూ.1,156 కోట్లకు పెరిగిందని కంపెనీ వెల్లడించింది. డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలలకు రూ.3,257.43 కోట్ల ఆదాయంపై రూ.387 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. కంపెనీకి రుణ భారం పెరిగిపోయినందున నగదు లభ్యత వ్యాపారాల కొనసాగింపు కష్టంగా మారవచ్చన్న అభిప్రాయాన్ని కంపెనీ ఆడిటర్లు వ్యక్తం చేశారు. సమీక్ష త్రైమాసికానికి విమానాశ్రయాల విభాగం నుంచి లభించిన ఆదాయం రూ.930 కోట్ల నుంచి రూ.1,044 కోట్లకు పెరిగింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/