ప్రశాంత్ కిషోర్ ఫై బీహార్ సీఎం నితీష్ పలు వ్యాఖ్యలు..స్పందించిన పీకే

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్..ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై పలు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంత్ కిషోర్ ను పబ్లిసిటీ నిపుణుడిగా అభివర్ణించారు. పబ్లిసిటీ కోసం ఆయన ఏమైనా చేస్తారని ..ఆయనే చేసే ప్రకటనలకు అర్థం లేదని , బిజెపి కోసం ప్రశాంత్ రహస్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. 2005 నుంచి బీహార్ లో ఏం జరిగిందో ఆయనకు ఏం తెలుసని ప్రశ్నించారు. వారికి పబ్లిసిటీ ఎలా తీసుకోవాలో.. స్టేట్మెంట్లు ఎలా ఇవ్వాలో తెలుసు, వారు అందులో నిష్ణాతులు అని అన్నారు. ఆయనకు బిజెపితో ఉండాలని మనసులో ఉన్నట్టుందని పలు వ్యాఖ్యలు నితీష్ చేసారు.

ఇక నితీష్ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా ప్రశాంత్ నాలుగు ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోల్లో ప్రధాని మోడీకి నితీశ్ కుమార్ నమస్కారాలు చేస్తున్నట్టు ఉన్నాయి. నెల రోజుల క్రితం అధికారం పక్షంతో ఉన్న నితీశ్ కుమార్… ఇప్పుడు విపక్షంతో ఉన్నారని ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు. ఇతరులపై ఆధారపడకుండా ఆయన ఉండలేరని అన్నారు. బిహార్ లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం జాతీయ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదని , ఈ మార్పును తాను కేవలం రాష్ట్రం వరకే చూస్తానని చెప్పుకొచ్చారు.