రుషికొండ తవ్వకాలపై పవన్ కళ్యాణ్‌ సెటైరికల్ ట్వీట్

రుషికొండ తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ సెటైరికల్ ట్వీట్ చేసారు. రిషికొండ తవ్వకాలను కప్పి పుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లను అంటిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. చెట్లు, కొండలను నరికేయడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైస్సార్సీపీ దుష్ట పాలకుల ముఖ్య లక్షణం అన్నారు.

రుషికొండను ధ్వంసం చేయడంలో వైస్సార్సీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందని వివరించారు. జగన్ ప్రభుత్వం సమాధానం చెబుతుందా లేక రుషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్‌ను అంటిస్తారా? అని నిలదీశారు.

రుషికొండలో నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని, పర్యావరణ విధ్వంసం జరుగుతున్నదంటూ ప్రజాప్రతినిధులు హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. విధ్వంసాన్ని రుజువు చేసే ఫొటోలను కూడా న్యాయస్థానానికి సమర్పించారు. అవన్నీ తప్పుడు ఫొటోలని ఏపీటీడీసీ హైకోర్టులో బుకాయించింది. పత్రికల్లో కూడా విధ్వంసంపై వరుసగా వార్తలు రావడంతో.. రుషికొండలో ఏం జరుగుతోందో పరిశీలించేందుకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ (ఎంవోఈఎఫ్‌) కమిటీని నియమించింది. ఆ బృందం గత నెలలో ఇక్కడకు వచ్చి పనులను, తవ్విన కొండను పూర్తిగా పరిశీలించి, శాస్త్రీయంగా అంచనాలు వేసి కోర్టుకు నివేదిక సమర్పించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతించిన దాని కంటే అధిక విస్తీర్ణంలో పనులు జరుగుతున్నాయని నిర్ధారించింది. ఎంత విస్తీర్ణంలో జరుగుతున్నాయి.. అందులో తవ్వింది ఎంత.. నిర్మాణాలు చేస్తున్నది ఎంత.. అతిక్రమించింది ఎంత .. మొదలైన వివరాలతో గణాంకాలను కూడా టేబుల్‌ రూపంలో నివేదించింది.