అసోం ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల్లో మార్పులు

బహుభార్యత్వానికి అనుమతి ఉన్న మత వాసులకు ఉపశమనం

No 2nd Marriage Without Government Approval, Assam Tells Employees

అస్సాం: అసోం ప్రభుత్వ ఉద్యోగులకు అక్కడి సర్కారు కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. అప్పటికే వివాహం చేసుకుని, జీవిత భాగస్వామి జీవించే ఉంటే రెండో వివాహం చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా బహు భార్యత్వం కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇద్దరు భార్యలు ఉంటే, ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు పెన్షన్ కు అర్హత విషయంలో వివాదాలు ఏర్పడుతున్నట్టు చెప్పారు.

ఒకవైపు భార్య జీవించి ఉంటే, మరో వివాహం చేసుకోకూడదంటూనే, మరోవైపు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని పేర్కొనడం గమనార్హం. కొన్ని మతాల్లో బహు భార్యత్వానికి అనుమతి ఉండడంతో ఇలా నిబంధనల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ‘‘అసోం ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం ఉద్యోగి రెండో వివాహం చేసుకోవడానికి అనుమతి ఉండదు. అయితే కొన్ని మతాలు రెండో వివాహం చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి. కనుక అలాంటి వారు ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది’’అని తాజా ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. భర్త మరణించినప్పుడు, అతడి భార్యలు పింఛనుకు అర్హత విషయంలో గొడవపడుతున్న కేసులు తరచూ ఎదురవుతున్నాయి. అలాంటి వివాదాలను పరిష్కరించడం కష్టం’’అని ప్రభుత్వం తెలిపింది.