మానవ తప్పిదం వల్లే ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదం

ఎన్‌జీటీకి శేషశయనా రెడ్డి కమిటి నివేదిక

Vizag Gas leakage
Vizag Gas leakage

అమరావతి: విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన మానవతప్పిదం వల్లే జరిగిందని రిటైర్డ్‌ జడ్జి శేషశయనరెడ్డి కమిటీ ఎన్‌జీటీకి నివేదిక ఇచ్చింది. ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో సోమవారం విచారణ జరిగింది. మానవతప్పిదం, భద్రతా వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని కమిటీ నివేదికలో పేర్కొంది. ఘటనపై విచారణ సందర్భంగా ఎల్‌జీ పాలిమర్స్‌ తరపున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఘటనను సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఎన్‌జీటీకి లేదని సిద్ధార్థ లూథ్రా వాదించారు. మరోవైపు 2001 నుంచి కూడా కంపెనీ అనుమతి లేకుండా కంపెనీ నడుస్తుందని ఈఏఎస్‌ శర్మ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. గ్యాస్‌ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వాదనలు విన్న ఎన్‌జీటీ ధర్మాసనం నివేదికను పరిశీలించిన తర్వాత లిఖిత పూర్వకమైన ఆదేశాలు వెలువరిస్తామని తెలిపింది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఎన్‌జీటీ తదుపరి ఆదేశాలు ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/