పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్ధూ బాధ్యతలు

హాజ‌రైన అమ‌రీంద‌ర్ సింగ్

చండీగఢ్‌ : పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఇటీవ‌లే నియ‌మితుడైన నవజ్యోత్‌ సింగ్ సిద్ధూ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. చండీగ‌ఢ్‌లోని కాంగ్రెస్ భ‌వ‌న్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ కూడా హాజ‌ర‌య్యారు. వేదిక‌పై అమ‌రీంద‌ర్ ప‌క్క‌నే నవజ్యోత్‌ సింగ్ సిద్ధూ కూర్చున్నారు. తాను ప్రసంగించడానికి మైక్ వ‌ద్ద‌కు వెళ్తున్న స‌మ‌యంలో సిద్ధూ కుర్చీలోంచి లేస్తూ బ్యాటింగ్ శైలిని అనుక‌రించారు.

బ్యాటింగ్ చేస్తూ సిక్స్ కొట్టిన‌ట్టుగా పోజు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. దీంతో అక్క‌డున్న కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లంతా ఈల‌లు వేశారు. కాంగ్రెస్‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తాన‌ని సిద్ధూ ఈ సంద‌ర్భంగా చెప్పారు. కాంగ్రెస్ లో నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు తేడాలు లేవ‌ని, అంద‌రూ ఒక్క‌టేన‌ని చెప్పుకొచ్చారు. పంజాబ్‌లో విద్యుత్ కొర‌త‌ను అధిగ‌మిస్తామ‌ని చెప్పారు.

అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఈ రోజు ఉద‌యం తేనీటి విందుకు అమ‌రీంద‌ర్ సింగ్‌తో క‌లిసి సిద్ధూ పాల్గొన్నారు. తన ప్రమాణ కార్యక్రమానికి హాజరు కావాలని నిన్న సీఎంకు సిద్ధూ లేఖ రాయ‌డంతో ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పంజాబ్ ఇన్‌ఛార్జ్ హ‌రీశ్ రావ‌త్ కూడా హాజ‌ర‌య్యారు. అమరీందర్, సిద్ధూ తేనీటి విందులో పాల్గొన్న స‌మ‌యంలోనూ ఆయ‌న అక్క‌డే ఉన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/