ముగిసిన గంగుల సీబీఐ విచారణ

మంత్రి గంగుల కమలాకర్ సిబిఐ విచారణ పూర్తయింది. నకిలీ సీబీఐ పేరుతో అక్రమాలకు పాల్పడ్డ విశాఖకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తో గంగుల ఫొటోస్ దిగిన నేపథ్యంలో సిబిఐ మంత్రి గంగుల కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నోటీసుల నేపథ్యంలో ఈరోజు ఢిల్లీ వెళ్లిన గంగుల ను సిబిఐ బృందం దాదాపు 9 గంటల పాటు విచారించింది.

సీబీఐ విచారణ ముగిసిన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన గంగుల కమలాకర్ పలు అంశాలను ప్రస్తావించారు. సీబీఐ అధికారుల ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం చెప్పానని ఆయన తెలిపారు. తనను, గాయత్రి రవిని అధికారులు వేర్వేరుగానే విచారించారన్నారు. విచారణకు మళ్లీ రావాలని తమకేమీ చెప్పలేదని కూడా ఆయన తెలిపారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ తో తాము ఎలాంటి లావాదేవీలు జరపలేదని చెప్పామన్న కమలాకర్…. అదే విషయాన్ని సీబీఐ అధికారులు రికార్డు చేసుకున్నారని తెలిపారు.