వ్యవసాయరంగ సలహాదారుడిగా చెన్నమనేని నామినేటెడ్

ఆయన పార్టీ మారబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం

MLA Chennamaneni Ramesh appointed as TS govt advisor on agri affairs

హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. టికెట్ దక్కని అభ్యర్థులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. వేములవాడ నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేశ్ కు కెసిఆర్ టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో చల్మెడ నరసింహారావుకు అవకాశం కల్పించారు. దీంతో, చెన్నమనేని అలకపాన్పు ఎక్కారు. ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది.

ఈ నేపథ్యంలో, చెన్నమనేనికి కెసిఆర్ మరో రూపంలో పదవిని కట్టబెట్టారు. ఆయనకు వ్యవసాయరంగ సలహాదారుడిగా నామినేటెడ్ పదవిని ఇచ్చారు. కేబినెట్ ర్యాంక్ ఉన్న ఈ పదవిలో చెన్నమనేని ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. దీంతో, చెన్నమనేని కథ సుఖాంతమయింది.

మరోవైపు మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, రాజయ్య వంటి వారికి కూడా ఈసారి బిఆర్ఎస్ టికెట్లు దక్కలేదు. దీంతో, వీరు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ అనుచరులతో చర్చించి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి వీరు సిద్ధమవుతున్నారు.