రాజ్ భ‌వ‌న్‌కు చేరిన ఏపీ మంత్రుల రాజీనామా లేఖ‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల రాజీనామా లేఖలు రాజ్ భవన్ కు చేరాయి. ఈరోజు గవర్నర్ బిశ్వ భూషణ్ హ‌రి చంద‌న్ ఆ రాజీనామాలను ఆమోదించనున్నారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ పూర్తయ్యాక మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు సమర్పించారు. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను మార్చి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని.. కొత్తవారికి మంత్రులుగా అవకాశం కల్పిస్తామని చెప్పారని.. కానీ తమకు 34 నెలలపాటు మంత్రివర్గంలో ఉండే అవకాశం ఇచ్చారని సీఎం జగన్‌కు మంత్రులంతా కృతజ్ఞతలు తెలిపారు. ఇక మంత్రుల రాజీనామా పత్రాలను సీఎం జగన్ ఈరోజు గవర్నర్‌కు సమర్పించారు.

రాష్ట్రంలో 24 మంత్రి ప‌ద‌వులు ఖాళీ అయిన‌ట్టు గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూషణ్ హ‌రి చంద‌న్ గెజిట్ విడుద‌ల చేయ‌నున్నారు. రాజీనామాలు ఆమోదం పొందిన వెంట‌నే.. రాజీనామా చేసిన మంత్రుల వాహ‌నాలు రాష్ట్ర ప్ర‌భుత్వం తిరిగి స్వాధీనం చేసుకోనుంది. అలాగే మంత్రులు ఉండే.. కార్యాల‌యాలు కూడా ఖాళీ చేయ‌నున్నారు. దీంతో పాటు రాజీనామా చేసిన మంత్రుల సిబ్బంది కూడా రిలీవ్ ఆర్డ‌ర్లు తీసుకోనున్నారు. ఈ నెల 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. మరి కొత్తగా మంత్రి పదవులు ఎవరికీ దక్కుతాయో చూడాలి.