ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి

కేంద్రం చేతిలో ఐటీ, ఈడీలు మాత్రమే ఉన్నాయని వ్యంగ్యం

minister-mallareddy

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు పంపడంపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. కేంద్రం చేతిలో ఐటీ, ఈడీలు మాత్రమే ఉన్నాయని అన్నారు. దేశం మొత్తం కెసిఆర్ ప్రధాని కావాలని భావిస్తోందని చెప్పారు. దీనిని ఓర్వలేక కేంద్రంలోని పెద్దలు ఐటీ, ఈడీలతో దాడులు చేపిస్తూ, నోటీసులు పంపుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు రాజకీయాల్లో ఓ భాగమేనని ఆరోపించారు.

మంత్రి మల్లారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ నేతలను కేంద్రం టార్గెట్ చేసిందని ఆరోపించారు. తన ఇంటిపై ఇటీవల జరిగిన ఐటీ దాడులను గుర్తుచేస్తూ ఆ తర్వాత ఏమైందని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలను మానసికంగా, రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారని కేంద్రంలోని బిజెపి నేతలపై విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో ఇదొక పార్ట్ మాత్రమేనని చెప్పారు. సిఎం కెసిఆర్‌ పాలనలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చూసి దేశంలో చాలామంది కెసిఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి చూసి రాష్ట్రానికి చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.