అసెంబ్లీ స‌మావేశాల తీరుపై ర‌ఘునంద‌న్ రావు వ్యంగ్యాస్త్రాలు

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల తీరుపై దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోమవారం తెలంగాణ అసెంబ్లీలో కేంద్రం విద్యుత్ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చలో విద్యుత్ బిల్లుపై టీఆర్ఎస్ నేతలు, సీఎం కేసీఆర్ కేంద్ర తీర్పు నిప్పులు చెరిగారు. విద్యుత్ మీటర్లకు మోటార్లు అమర్చటం దారుణం అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో విద్యుత్ సవరణ బిల్లుపై చర్చలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడుతూ..అసలు ఈ విషయంపై చర్చే అవసరం లేదని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ నేతలు, మంత్రులు చెబుతున్నవి పచ్చి అబద్ధాలు అని అన్నారు.

విద్యుత్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై పలువివర్శలు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్కవిమర్శ కూడా చేయలేదు. భట్టి విక్రమార్క కేంద్రాన్ని విమర్శించటంతో సీఎం కేసీఆర్ భట్టిని పొగిడారు. ధన్యవాదాలు తెలిపారు. దీనిపై రఘునందన్ అసెంబ్లీ బయట మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్ బిల్లుపై తాను అసెంబ్లీలో మాట్లాడుతుంటే అడ్డుపడ్డారని..కనీసం మూడు నిమిషాలు కూడా తనను మాట్లాడనివ్వలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం విద్యుత్ బిల్లుపై బయటమాత్రం కాంగ్రెస్ కేంద్రాన్ని విమర్శిస్తుంది కానీ అసెంబ్లీలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వానికి వంత పాడిందని భట్టి విక్రమార్క వ్యాఖ్యలను గుర్తు చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు ఒకరికొకరు భజన చేసుకుంటున్నాయని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా టీఆర్ఎస్ కు కాంగ్రెస్ వత్తాసు పలుకుతోందని టీఆర్ఎస్ తానా అంటే కాంగ్రెస్ తందానా అంటోందంటూ ఎద్దేవా చేశారు.

అలాగే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టే దిశ‌గా సాగుతున్న తీరుపై రఘునందన్ స్పందించారు. జాతీయ పార్టీ పెట్టొద్ద‌ని కేసీఆర్‌ను ఎవ‌రు ఆపార‌ని ప్ర‌శ్నించారు. ‘బీఆర్ఎస్ పెట్టుకోండి.. వీఆర్ఎస్ కూడా తీసుకోండి’ అని వ్యాఖ్యానించారు. లేదంటే ఫాం హౌస్‌కు ప‌రిమిత‌మైనా త‌మ‌కేమీ అభ్యంత‌రం లేద‌ని కూడా ఆయ‌న అన్నారు. క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు తెలంగాణ‌లో క‌ల‌వాల‌ని అడుగుతున్నార‌న్న ఆయ‌న‌.. హైద‌రాబాద్ సంస్థానంలోని పాత ప్రాంతాల‌ను తిరిగి తెలంగాణ‌లో క‌లుపుతూ తీర్మానం చేయండి అని సూచించారు.