తగిన ప్రాధాన్యత ఇవ్వకుంటే ఒంటరిగా బరిలోకి దిగుతాంః సీఎం మమతా బెనర్జి

సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్‌కు తేల్చిచెప్పిన తృణమూల్ కాంగ్రెస్

Mamata Banerjee mounts pressure on Cong, says TMC can contest all Bengal seats

కోల్‌కాతాః పశ్చిమ బెంగాల్‌లో సీట్ల పంపకం విషయమై విపక్షాల ఇండియా కూటమిలో మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య అంతర్గత పోరు నడుస్తున్న వేళ సీఎం మమతా బెనర్జీ బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తగిన ప్రాధాన్యట ఇవ్వకుంటే రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె హెచ్చరించారు. మైనారిటీ జనాభా అధికంగా ఉన్న కాంగ్రెస్‌ కంచుకోట ముర్షిదాబాద్ జిల్లా సంస్థాగత సమావేశంలో శుక్రవారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల సమరానికి కార్యకర్తలు సిద్ధం కావాలని సూచించారు. జిల్లాలోని 3 లోక్‌సభ స్థానాల్లో పార్టీ విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారు.

ఇండియా కూటమిలో టీఎంసీ అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో ఒకటని టీఎంసీకి చెందిన ఓ నేత అన్నారు. బెంగాల్‌లో తమను కాదని ఆర్‌ఎస్‌పీ, సీపీఐ, సీపీఎంలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే తాము తమ మార్గాన్ని చూసుకోవాల్సి ఉంటుందన్నారు. 42 స్థానాల్లో పోరాడి గెలవడానికి సన్నాహాలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా 28 పార్టీలతో కూడిన విపక్ష ఇండియా కూటమికి సంబంధించి పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం) ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. అయితే సీట్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్, తృణమూల్ మధ్య సయోధ్య కుదరడం లేదు. ఇరు పార్టీలకు చెందిన నేతలు బహిరంగంగా పరస్పర విమర్శలకు దిగుతున్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు టీఎంసీ కేవలం 2 సీట్లు మాత్రమే ఆఫర్ చేసిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సీట్లు కావాలంటూ టీఎంసీని కాంగ్రెస్ భిక్షం అడుక్కోదని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. దీనికి కౌంటర్‌గా మమత తాజా వ్యాఖ్యలు చేశారు.