భూ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు ఊరట

బెయిల్‌ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు

Land-for-job case: Delhi court grants bail to Lalu Yadav, Rabri Devi, Tejashwi Yadav |

న్యూఢిల్లీః ఆర్జేడీ అధినేత, బీహార్‌ మాజీ సిఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు భూ కుంభకోణం కేసు లో ఊరట లభించింది. ఈ కేసులో ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు లాలూకు బెయిల్‌ మంజూరు చేసింది. ఆయనతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ భార్య రబ్రీదేవి , ఆయన కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ ఎంపీ మిసా భారతికి కూడా న్యాయస్థానం బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూ ప్రసాద్‌ రైల్వే మంత్రిగా పనిచేసినప్పుడు ఈ కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎటువంటి నియామక ప్రక్రియా చేపట్టకుండా అభ్యర్థుల నుంచి భూములు తీసుకుని రైల్వేలో గ్రూప్‌ డీ ఉద్యోగాలు కల్పించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఇప్పటికే లాలూ కుటుంబ సభ్యులను ఈడీ విచారించింది. లాలూకు చెందిన రూ.6కోట్ల విలువైన ఆస్తులను కూడా జప్తు చేసింది. ఈ అభియోగాలపై గతేడాది మే 18న సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ కేసులో లాలూతోపాటు మరో 15 మందిపై కేసు నమోదు చేసింది. అదే ఏడాది అక్టోబర్‌లో ఛార్జీషీట్‌ను దాఖలు చేయగా.. ఈ ఏడాది జులై 3న మరో ఛార్జ్‌షీట్‌ను సీబీఐ సమర్పించింది. ఇందులో భాగంగా విచారణకు హాజరుకావాలని నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్‌ ఢిల్లీలో రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు. లాలూ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, 2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో బీహార్‌కు చెందిన యువ‌త‌కు గ్రూపు డీ పోస్టుల్ని కేటాయించిన‌ట్లు లాలూపై ఆరోపణలు వచ్చాయి. ముంబై, జ‌బ‌ల్‌పూర్‌, కోల్‌క‌తా, జైపూర్‌, హాజీపూర్ జోన్లలో బీహారీల‌కు ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.