హర్షవర్ధన్‌ అరెస్ట్ చేయించుకొని డ్రామాలు ఆడుతున్నాడు – జూపల్లి

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఉదయం నుండి టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై అంబేడ్కర్ చౌరస్తాలో చర్చకు రావాలని జూపల్లి సవాల్ విసరగా.. డైరెక్టుగా ఇంటికే వస్తానని ఎమ్మెల్యే హర్షవర్ధన్ అన్నారు. దీంతో ఈరోజు తెల్లవారుజాము నుంచే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇద్దరు నేతల ఇళ్లకు చేరుకున్నారు. బహిరంగ చర్చకు తాము రెడీగా ఉన్నామని ప్రకటించారు.

దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. బహిరంగ చర్చకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ హర్షవర్ధన్ తన కార్య కర్తలతో జూపల్లి ఇంటికి బయలుదేరగా, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసారు. ఈ క్రమంలోనే మీడియా ముందుకు వచ్చి జూపల్లి.. తనపై ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. నన్ను ఎదుర్కొలేనని తెలిసే బీరం హర్షవర్ధన్‌ డ్రామాలు చేస్తున్నారన్నారు. బ్యాంకురుణాలు ఎగ్గొట్టాడని తనపై తప్పుడు ఆరోపణలు చేశాడన్న ఆయన… బ్యాంకు రుణాలు చెల్లించినట్లు రుజువులు చూపించారు.

మూడున్నరేళ్లు ఎమ్మెల్యే ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అరెస్టు చేయించుకుని తప్పించుకుని పోయినవ్.. ముఖం చాటేసుకున్నవ్. ఎమ్మెల్యే మాట మార్చాడు. నేను మాట మార్చలేదు. హుస్సేన్ సాగర్ కారు ప్రమాదం, ఫ్రుడెన్షియల్ బ్యాంకు వ్యవహారాలపై ఎమ్మెల్యే అవాస్తవాలు మాట్లాడుతున్నాడు. అప్పు తీసుకుని వ్యాపారం చేసాం, ఇది తప్పు అన్నట్లుగా మాట్లాడితే ఎట్లా!. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయొద్దని సహచర మంత్రులే సూచించినా నేను వెనక్కి తగ్గలేదు. మిగతా మంత్రులపై ఒత్తిడి వస్తుంది వద్దన్నారు.

వెయ్యి కోట్లిచ్చినా అమ్ముడు పోయే వ్యక్తిని కాను. నాది మచ్చలేని చరిత్ర. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కోర్టులో కేసు వేసిందెవరు? నా పై నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బీరంపై పరువు నష్టం దావా వేస్తా’అని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. రిజర్వాయర్‌ ముంపు బాధితులకు సరైన పరిహారం అందలేదు. ముంపు బాధితులకు పునరావాసం కూడా ఇప్పటికీ దక్కలేదు. వర్షం పడితే ఊరు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ముంపు బాధితులది. సమస్య పరిష్కరించకుండా ఎమ్మెల్యే నాపై నిందారోపణలు చేశారు. నేను సంపాదించిన పేరు, ప్రతిష్ఠలను మసకబార్చే ప్రయత్నం చేశారు. మంచి చేసి పేరు సంపాదించాలి.. చౌకబారు రాజకీయాలెందుకు?. ఆరోపణలపై చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యేకు సవాల్‌ చేశా. అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద చర్చకు రమ్మని 15 రోజులు సమయమిచ్చా. అంబేడ్కర్‌ చౌరస్తాలో సంతకు ఇబ్బంది అవుతుందన్నారు. మీ ఇంటికే వస్తా.. ఆరోపణలపై అక్కడే చర్చిద్దామన్నారు. ఉదయం నుంచి ఎదురుచూస్తున్నా.. నా వద్దకు వచ్చేందుకు ధైర్యం చాలక అరెస్టు చేయించుకున్నారు అని జూపల్లి అన్నారు.