IPL 2022 : హైదరాబాద్‌ సన్‌రైజర్స్ హ్యాట్రిక్ విజయం

ఐపీల్ 2022 లో హైదరాబాద్‌ సన్‌రైజర్స్ హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 175 పరుగులు చేసింది. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ సన్‌రైజర్స్ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో 176 పరుగులు చేసి విజయం సాధించింది.

రాహుల్ త్రిపాఠి (71), మార్‌క్రమ్‌ (68) అర్ధశతకాలతో హైదరాబాద్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. కేన్‌ విలియమ్సన్ 17, అభిషేక్ శర్మ 3, నికోలస్ పూరన్ 5 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ 2, ప్యాట్ కమిన్స్‌ ఒక వికెట్ తీశారు. తాజా సీజన్‌లో ఐదో మ్యాచ్ ఆడిన హైదరాబాద్‌కి ఇది మూడో విజయంకాగా.. ఆరో మ్యాచ్ ఆడిన కోల్‌కతాకి ఇది మూడో ఓటమి. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్ 3, ఉమ్రాన్‌ మాలిక్ 2.. భువనేశ్వర్‌ కుమార్‌, మార్కో జాన్‌సెన్, సుచిత్ తలో వికెట్ తీశారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు తీస్తూ కోల్‌కతా బ్యాటర్లపై ఒత్తిడి తేవడంలో హైదరాబాద్‌ బౌలర్లు విజయవంతమయ్యారు.