దేవాలయశాఖలో వినూత్న మార్పులు : మంత్రి వెలంపల్లి

అమరావతి: దేవాలయశాఖలో వినూత్న మార్పులు తెస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. దేవదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కీలక మార్పులు తెచ్చిందన్నారు. ఆలయ భూముల లీజులు ఎగ్గొట్టే వారిపై చర్యలు తీసుకుంటున్నామని, అన్ని విభాగాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో విజిలెన్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తామన్నారు. దేవాలయాల అభివృద్ధికి ‘నాడు-నేడు’ కార్యక్రమం చేపడతామన్నారు. శాఖలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ప్రతి ఆలయంలో గోశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. హిందువుల మనోభావాలకు తగ్గట్టుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా దేవాదాయ శాఖపై కనీసం పూర్తి స్థాయి రివ్యూ చేయలేదన్నారు. దేవాలయాలు, దేవతా మూర్తుల ప్రాశస్త్యం వివరించేలా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలోని 175 ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు నిర్వహించేలా.. డోనేషన్లు నేరుగా టెంపుల్ ఖాతాలోకి వెళ్లేలా చర్యలు చేపడతామన్నారు. ప్రతి ఆలయంలో ఆభరణాల వివరాలు డిజిటలైజ్ చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. త్వరలోనే 9 కొత్త దేవాలయాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రసాదం స్కీం ద్వారా ప్రముఖ దేవాలయాల అభివృద్ధి చేస్తున్నామని వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/