కాప్ 26 సదస్సులో తమిళనాడు టీనేజర్ వినీశా ప్రసంగం

మిమ్మల్ని చూస్తుంటే కోపమొస్తోంది.. ప్రపంచ వేదికపై దేశాధినేతలకు 14 ఏళ్ల భారత అమ్మాయి చురకలు


గ్లాస్గో: గ్లాస్గోలో కాప్‌26 స‌ద‌స్సులో త‌మిళ‌నాడుకు చెందిన 14 ఏళ్ల అమ్మాయి వినీషా ఉమాశంక‌ర్ ఇండియా త‌ర‌పున త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసింది. ప‌లు అంశాల‌పై మాట్లాడిన ఆమె త‌న ప్ర‌సంగంతో అంద‌ర్నీ ఆక‌ట్టుకున్న‌ది. వాగ్దాల‌ను నిల‌బెట్టుకోలేక‌పోతున్న ప్ర‌పంచ నేత‌ల‌పై నేటి త‌రం యువ‌త ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు ఆమె పేర్కొన్న‌ది. ఈ భూగోళాన్ని ర‌క్షించేందుకు నేత‌లంతా యాక్ష‌న్‌లోకి దిగాల‌ని వినీషా త‌న ప్ర‌సంగంలో తెలిపింది. ప్ర‌ధాని మోడీ, బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌, అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ హాజ‌రైన ఈ ఈవెంట్‌లో .. వారి స‌మ‌క్షంలోనే వినీషా త‌న శ‌క్తివంత‌మైన ప్ర‌సంగాన్ని వినిపించింది.

‘‘నేను కేవలం భారత్ బిడ్డనే కాదు.. ఈ ధరిత్రీ పుత్రికను. అందుకు నేను గర్విస్తున్నాను’’ అంటూ మొదలు పెట్టింది. ‘‘మీ శుష్క వాగ్దానాలు వినీవినీ విసిగొచ్చేస్తోంది.. మిమ్మల్ని చూస్తే కోపం వస్తోంది.. కానీ, నాకు అంత సమయం లేదు. చేతల్లోనే చేయాలి. ఇక మీరు చెప్పింది చాలు.. చేతల్లో చూపించండి’’ అంటూ ప్రపంచాధినేతలకు భయం..బెరుకు లేకుండా సూటిగా చెప్పేసింది ఆ అమ్మాయి. పర్యావరణాన్ని రక్షించి భూమిని కాపాడండి. పాత చర్చలపై అనవసర ఆలోచనలను మానండి. నవ భవిష్యత్ కోసం నవ దృక్పథం ఎంతో అవసరం. కాబట్టి మీరు మీ సమయాన్ని, డబ్బును, ప్రయత్నాలను మా లాంటి ‘ఎర్త్ షాట్ ప్రైజ్’ విన్నర్లు, ఫైనలిస్టుల ఆవిష్కరణలపై ఇన్వెస్ట్ చేయండి. శిలాజ ఇంధనాలు, పొగ, కాలుష్యం వంటి వాటి వల్ల నిర్మితమవుతున్న ఆర్థిక వ్యవస్థపై కాదు’’ అంటూ చురకలంటించింది. తమతో పాటు ప్రపంచ నేతలు కలిసి నడవాలని, స్వచ్ఛ ఇంధనాలను రూపొందించాల్సిన అవసరం ఉందని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. పాతకాలపు ఆలోచనలు, అలవాట్లను వదులుకోవాలని సూచించింది. తాము పిలిచినప్పుడు మీరొచ్చినా..రాకున్నా.. తామే ముందుండి ఆ బాధ్యతను తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రపంచ నేతలు ఆలస్యం చేసినా తాము రంగంలోకి దిగుతామని పేర్కొంది. తమ భవిష్యత్తును తామే కాపాడుకుంటామని తేల్చి చెప్పింది.

కాగా, ఆ అమ్మాయి పేరు వినీశా ఉమాశంకర్. తమిళనాడులోని తిరువణ్ణమలై జిల్లా ఆమె ఊరు. జర్మనీలోని గ్లాస్గోలో నిర్వహిస్తున్న కాప్ 26 సదస్సులో ఆమె పాల్గొంది. క్లీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ అనే అంశంపై ఉద్విగ్న భరితమైన ప్రసంగం ఇచ్చింది. బ్రిటన్ యువరాజు విలియమ్స్ ఆహ్వానం మేరకు ఆమె అక్కడి వరకు వెళ్లి ప్రపంచ వేదికపై తన గళాన్ని వినిపించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/