పొడవైన రోడ్డు నిర్మాణం.. భార‌త్ కు గిన్నిస్ రికార్డ్

మహారాష్ట్రలోని అమరావతి నుంచి అకోలా మధ్య హైవే నిర్మాణం
జూన్ 3 నుంచి 7 దాకా ఏకధాటిగా 75 కిలోమీటర్లు రోడ్డేసిన వైనం

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్ స్ట్రెచ్ ను నిర్మించిన ఘనతను భారత్ దక్కించుకొని గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ వెల్లడించారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ), రాజ్ పథ్ ఇన్ ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, జగదీశ్ కదమ్ లు కలిసి 53వ నంబర్ జాతీయ రహదారిపై 75 కిలోమీటర్ల పొడవునా ఏకధాటిగా సింగిల్ లైన్ స్ట్రెచ్ రోడ్డును నిర్మించారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి అకోలా జిల్లాల మధ్య ఈ రహదారిని నిర్మించారు. జూన్ 3 నుంచి జూన్ 7 మధ్య ఈ రికార్డును సాధించారంటూ గిన్నిస్ సర్టిఫికెట్ లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇంతటి గొప్ప పనిలో రేయింబవళ్లు భాగమైన ఇంజనీర్లు, కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. వారి దృఢసంకల్పం, చెమటధారతోనే నవ భారత నిర్మాణం సాధ్యమవుతోందని చెప్పారు. ఈ గొప్ప పనికి దేశం మొత్తం గర్విస్తోందన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/