బిపిన్ రావత్ మంచినీళ్లు కావాలని అడిగారు : ప్రత్యక్ష సాక్షి

హెలికాప్టర్ మండిపోతూ పడిపోతుండటాన్ని చూశాం..
మాతో బిపిన్ రావత్ మాట్లాడారు..ప్రత్యక్ష సాక్షి కంటతడి


ఊటీ : ఘోర హెలికాప్టర్ ప్రమాదంతో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణితో పాటు మరో 11 మంది దుర్మరణం పాలయ్యారు. నీలగిరి కొండల్లోని కూనూర్ వద్ద సంభవించిన ఈ ప్రమాదంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఒళ్లు జలదరించే విషయాలను వెల్లడిస్తున్నారు.

శివకుమార్ అనే వ్యక్తి అక్కడి టీ ఎస్టేట్ లో పని చేస్తున్న తన సోదరుడిని కలిసేందుకు వెళ్లాడు. ఆ సమయంలోనే ఈ ప్రమాదం సంభవించింది. ఆయన ఏం చెప్పారంటే.. “ఆకాశంలో హెలికాప్టర్ మండిపోతూ పడిపోతుండటాన్ని నేను చూశాను. హెలికాప్టర్ కూలిపోయిన వెంటనే నేను, మరి కొందరు ఆ ప్రాంతానికి పరుగులు పెట్టాము. మూడు శరీరాలు పడిపోవడాన్ని మేము చూశాం. వారిలో ఒకరు ప్రాణాలతో ఉన్నారు. ఆయనను మేము బయటకు లాగాము. ఆ సమయంలో ఆయన నీళ్లు కావాలని మమ్మల్ని అడిగారు. ఆయనను బెడ్ షీట్ లో రెస్క్యూ టీమ్ తీసుకెళ్లారు. మూడు గంటల తర్వాత మాకు ఎవరో చెప్పారు… మేము మాట్లాడిన వ్యక్తి జనరల్ బిపిన్ రావత్ అని. నాకు ఎంతో బాధ అనిపించింది. దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి చివరకు నీళ్లు కావాలని మమ్మల్ని అడిగారు. అప్పుడు ఆయనకు ఇవ్వడానికి మా దగ్గర నీళ్లు లేవు. నిన్న రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు” అన్నారు. ఈ విషయాన్ని చెపుతూ శివకుమార్ కంటతడి పెట్టుకున్నారు.

మరో విషయం ఏమిటంటే, ఘటనా స్థలి నుంచి మిలిటరీ ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించడం కోసం బెంగళూరులోని మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/